У вашего броузера проблема в совместимости с HTML5
తాత్కాలిక సుఖాల కోసం శాశ్వత సుఖాలను దూరం చేసుకోకూడదు.
తత్కాల సుఖాల కోసం శాశ్వతమైన ధర్మాన్ని త్యాగం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం.
ఆలయాలకు వచ్చే జనం పెరుగుతున్నారు, గుళ్ళు, గోపురాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. వారి స్వార్థాలు తీర్చుకోవడానికి భగవంతుడిని ఒక ఉపకరణం అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ధర్మాన్ని మాత్రమే చూస్తాడు, ధర్మాన్ని మెచ్చుతాడు అనే స్పృహ కలగడం లేదు.
తత్కాల సుఖాలకోసం శాశ్వతమైనవి విడిచి పెడితే శాశ్వతమైనవి ఎలాగూ దొరకవు. తత్కాలానివి తత్కాలం ఉంటాయి. మిగలవు కనుక అవీ పోతాయి. భ్రష్టుడౌతాడు అనే విషయాన్ని చెప్తూ -
యో ధృవాణి పరిత్యజ్య అధృవం పరిషేవతే!
ధృవాణి తస్య నశ్యన్తి అధృవం నష్టమేవచ!!
ఎవరైతే ధృవాలను (స్థిరమైన శాశ్వతమైన విలువలను) విడిచిపెట్టి అశాశ్వతమైన అస్థిరమైన విలువలను సేవిస్తాడో వారికి ఆ శాశ్వత సుఖమూ దూరం అవుతుంది. తాత్కాలికమైనది కనుక కొంతకాలానికి ఇదీ పోతుంది.
వ్యాధిగ్రస్తులను కొన్ని పదార్థాలను వైద్యుడు తిన్నద్దు అని చెప్తాడు. వైద్యుడు వేటిని తినద్దు అని చెప్పాడో అవి వీడికి రుచిస్తూ ఉంటాయి. ఎలాగోలా తినేద్దాం అనుకుంటే అది తత్కాలంగా సుఖంగా ఉంటుంది. కానీ తాత్కాలిక సుఖం కోసం తెగించి ఆ పదార్థాన్ని తింటే శాశ్వతమైన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. ఇది తాత్కాలికమైన రుచి మాత్రమే గనుక తాత్కాలిక సుఖాన్నే ఇస్తున్నది.
వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు శాశ్వతమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కాపురం చేయాలి. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల కలిగే సంతానం, వాటికి స్థిరత్వం, కలిగే సంతానం కూడా అమ్మ నాన్న ఉన్నారు అని వాళ్ళ ఇద్దరి రక్షణనూ పొంది ఆరోగ్యవంతంగా పెరుగుతారు. కానీ తత్కాలంగా భర్త నచ్చలేదని భార్యయో, భార్య నచ్చలేదని భర్తయో తాత్కాలిక సుఖం కోసమని చెప్పి బంధాన్ని తెంచుకుంటే శాశ్వతమైన విలువలు, శాశ్వతమైన ప్రయోజనం దెబ్బతింటోంది.
శాశ్వతము, ధృవము ఏమిటి అంటే ధర్మం ఒక్కటే శాశ్వతం. ధర్మం తత్కాలంగా కష్టం అనిపించినప్పటికీ శాశ్వతంగా మంచి ప్రయోజనాలను మనకు అందిస్తున్నది గనుక శాశ్వత విలువలు అంటే ధర్మమే.
స్థిరమైన ప్రయోజనాల కోసమే ప్రయత్నించాలి తప్ప అస్థిరమైన ప్రయోజనాల కోసం సమయాన్ని కానీ, శక్తిని కానీ వ్యర్థం చేసుకోకూడదు.