దీనులను, అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం అత్యంత పుణ్యప్రదమైన అంశం. అది అనేక పాపాలను దహనం చేస్తుంది. మనల్ని ఉన్నత గతిలోకి తీసుకొస్తుంది.
దాహంతో ఉన్న వాడికి జలం ఇవ్వడం, ఆకలితో ఉన్నవాడికి అన్నం ఇవ్వడం, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వడం – ఇలా ఆడుకోవడాన్ని దయ అంటారు. దానం అని చెప్పడానికి లేదు.
దానానికి కేవలం దైన్యము, దారిద్ర్యము అర్హత కాదు.
గ్రహ దోషాలు పోవాలి అని చెప్పే దానాలు సంకల్పం చెప్పుకొని దానం చేస్తాం. ఇటువంటి దానం శ్రోత్రీయుడు, నిత్య అనుష్ఠానపపరుడు, వేదాది శాస్త్ర సంపన్నుడు అయిన వాడికే ఇవ్వడం చాలా మంచిది. కనీసం అనుష్ఠానపరుడై, నియమబద్ధుడైనా కావాలి. కేవలం వర్ణంలో పుట్టినంత మాత్రాన దానానికి అర్హుడు అని శాస్త్రం చెప్పలేదు.
దానం పుచ్చుకున్నప్పుడు వారి దోషం పోవాలని ప్రతిగ్రహీత పుచ్చుకుంటాడు. అప్పుడు తప్పకుండా వాడి దోషాలు వీడికి సంక్రమిస్తాయి. కనుక దానం పుచ్చుకునే వాళ్ళు జాగ్రత్తగా బ్రతకాలి.
దానం పుచ్చుకోగానే వీరిలోని తపశ్శక్తి క్షీణించిపోతుంది. తపస్సు క్షీణిస్తున్న కొద్దీ వీరికి విపరీత ఫలితాలు జీవితంలో లబిస్తూ ఉంటాయి.
హిరణ్యం భూమి మశ్వం గామన్నం వాసస్తిలాన్ ఘృతమ్ ।
ప్రతిగృహ్ణన్నవిద్వాంస్తు భస్మీభవతి దారువత్!!
దానం పట్టడం వల్ల వచ్చిన దోషానికి తగిన పరిహారం చేసుకోవడం తెలియని వాడు కొన్ని దానాలు గ్రహిస్తే వెంటనే దెబ్బతింటాడు. అవి ముఖ్యంగా బంగారం, భూమి, గుఱ్ఱము, ఆవు, ఎద్దు, వస్త్రము, తిలలు, నెయ్యి. వీటిని గ్రహించినప్పుడు ఎక్కువగా అనుష్ఠానం చేసుకోవాలి.
అతపస్త్వానధీయానః ప్రతిగ్రహ రుచిర్ద్విజః!
అమ్భస్యశ్మప్లవేనేవ సహ తేనైవ మజ్జతి!!
తపస్సు అధ్యయనము లేని వాడు కేవలం ప్రతిగ్రహణం మీదనే ఆసక్తి ఉన్నటువంటి వాడు, రాతి బండ పట్టుకుని నదిలోకి దిగినటువంటి వాడు. వాడు కూడా మునిగిపోతాడు, భ్రష్టుడౌతాడు.
నవార్యపి ప్రయచ్ఛేత్ బైడాల వ్రతికే ద్విజే!
న బకవ్రతికే విప్రే న వేదవిధి ధర్మ విత్ !!
బిడాల వ్రతునికి, బక వ్రతునికి దానం చేయరాదు.
బిడాల వ్రతుడు అనగా ధర్మం ఆచరించడు, కానీ ఆచరిస్తున్నట్లు కనబడుతూ కబుర్లాడుతూ ఉంటాడు. ఇతరుల ధనం మీద ఆశ కలిగిన వాడు, లోభియైన వాడు కూడా బిడాలవ్రతుడే. వంకలు, సాకులు చెప్తూ తిరుగే వాడు, ప్రజలను వంచించే వాడు, అందరినీ ఆక్షేపించి అవమానిస్తూ ఉండేవాడు, హింసా ప్రవ్రుత్తి కలవాడు – ఇటువంటి వాడిని బిడాల వ్రతుడు అంటారు.
వినయాన్ని అభినయిస్తూ ఉంటాడు, కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. స్వార్థం కోసం ఏదైనా చేసేవాడు, రహస్యంగా అపకారం చేసేవాడు, - ఇటువంటి వాడిని బకవ్రతుడు అనాలి.